ప్రస్తుత కాలంలో డయాబెటీస్ మాదిరిగానే మానవాళిని వెంటాడుతున్న సమస్యలలో థైరాయిడ్ కూడా ఒకటి. అయితే థైరాయిడ్‌లో హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడిజం అని 2 రకాలు ఉన్నాయి. ఈ రెండింటిలో ఏది వచ్చినా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో థైరాయిడ్‌తో బాధపడేవారు కొన్ని రకాల ఆహారపు అలవాట్లు చేసుకుని శరీరానికి కావలసిన ఆహారాలను తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరి వారి సూచనల ప్రకారం థైరాయిడ్ సమస్యతో ఉన్నవారు తీసుకోవలసిన ఆహారాలేమిటో ఇప్పుడు చూద్దాం..
హైపో థైరాయిడిజమ్ నుంచి బయటపడడానికి అయోడిన్ చాలా అవసరం. ఈ ఖనిజం అన్ని రకాల చేపలు, గుడ్లు, పాలు... పాల ఉత్పత్తుల్లో ఉంటుంది. వీటిలో అయోడిన్ సమృద్ధిగా ఉంటుంది. అలాగే వంటల్లో అయోడిన్‌తో కూడిన ఉప్పు వాడడం మంచిది. సెలీనియం బ్రెజిల్ నట్స్ (డ్రై ఫ్రూట్స్ దుకాణంలో ఈ పేరుతోనే లభిస్తాయి) రోజుకు రెండు తినాలి. రోజూ ఒక స్పూన్ అవిసె గింజలు, సబ్జా గింజలు తీసుకోవాలి. వెజ్ సలాడ్, చికెన్, మాంసం, రొయ్యలు వారానికి ఒకటి – రెండుసార్లు తీసుకోవాలి.
థైరాయిడ్ లక్షణాలివి..
ఎప్పుడూ అలసట, బరువు పెరగడం, ఎప్పుడూ జలుబు చేసినట్లు అసౌకర్యంగా అనిపించడం, జుట్టు రాలిపోవడం, మానసికంగా న్యూనతకు లోనుకావడం వంటి ప్రధానంగా కనిపించే లక్షణాలతోపాటు మరికొన్ని ఇతర లక్షణాలు కూడా ఉంటాయి.
థైరాయిడ్ ఉన్నవారు తీసుకోవలసిన ఆహారాలు
ఫైబర్: థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు ఫైబర్ కంటెంట్ ఉన్న ఆహారాలను తీసుకోవడం చాలా మంచిది. ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను తీసుకుంటే హైపో థైరాయిడ్ సమస్య నుంచి బయటపడవచ్చు.
తోటకూర గింజలు.. తోటకూర గింజల్లో సెలీనియం మెండుగా ఉంటుంది. ఇది T4ని T3గా మార్చడానికి అవసరం, ఎందుకంటే డియోడినేస్ ఎంజైమ్‌లు (T4 నుంచి అయోడిన్ అణువులను తొలగించే ఎంజైమ్‌లు) సెలీనియంపై ఆధారపడి ఉంటాయి.
మొలకెత్తిన విత్తనాలు: థైరాయిడ్‌తో బాధపడేవారు మొలకెత్తిన అవిసె గింజలు, చియా సీడ్స్‌ను తీసుకోవడం చాలా ఉత్తమం. ఇవి శరీరానికి ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లను అందించి థైరాయిడ్ గ్రంథి మెరుగ్గా పని చేసేలా ప్రభావితం చేస్తాయి.
చేపలు: థైరాయిడ్ ఉన్నవారు చేపలను తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చేపల్లో ఉండే ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు హైపో థైరాయిడ్ సమస్యతో ఇబ్బందులు పడేవారికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇవి ముఖంలోని వాపులు తగ్గిస్తాయి. ఇంకా థైరాయిడ్, నాడీ మండల వ్యవస్థలను సక్రమంగా పని చేసేలా చేస్తాయి. ఫలితంగా థైరాయిడ్ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
కొబ్బరినూనె: థైరాయిడ్ సమస్య ఉన్నవారిలో మెటబాలిజం క్రమబద్దంగా ఉండకపోవడంతో ఒకేసారి బరువు పెరగడమో లేదా అకస్మాత్తుగా బరువు తగ్గడం జరుగుతుంది. కానీ వీరు కొబ్బరినూనెను నిత్యం తీసుకుంటే అందులో ఉండే మీడియం-చెయిన్ ఫ్యాటీ యాసిడ్లు మెటబాలిజాన్ని మెరుగు పరుస్తాయి. ఫలితంగా అలసట తగ్గడంతో పాటు జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. క్రమక్రమంగా హైపో థైరాయిడ్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
పెసర గిజలు : వీటిలో అయోడిన్ థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి తోడ్పడుతుంది. ట్రైఅయోడోథైరోనిన్ (T3), థైరాక్సిన్ (T4)థైరాయిడ్ హార్మోన్లలో అయోడిన్ ఉంటుంది. థైరాయిడ్ పేషెంట్స్ పెసరలు తీసుకుంటే మంచిది. థైరాయిడ్ పనితీరుకు తగినంత మొత్తంలో అయోడిన్ అవసరం. పెసరల్లో ఈ అయోడిన్ మెండుగా ఉంటుంది.
పెరుగు: ఇది అయోడిన్ గొప్ప మూలం. ఇది ప్రోబయోటిక్ సూపర్ ఫుడ్ కూడా, పెరుగు పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. థైరాయిడ్ సమస్య ఆటో ఇమ్యూన్ వ్యాధి కారణంగా సంభవిస్తాయి. మీ ఇమ్యూనిటీని మెరుగుపరచుకోవడానికి.. పేగులను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం.
దానిమ్మ: ఈ పండులో పాలీఫెనాల్స్ మెండుగా ఉంటాయి, ఇవి శరీరం నుంచి ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి, తద్వారా శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. దానిమ్మ తరచుగా తీసుకుంటే.. థైరాయిడ్ గ్రంధి పనితీరు మెరుగుపడుతుంది.
ఉసిరి: ఉసిరికాయలో నారింజ కంటే 8 రెట్లు ఎక్కువ విటమిన్ సి, దానిమ్మపండు కంటే 17 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. థైరాయిడ్ గ్రంధి అతిగా క్రియాశీలంగా పనిచేస్తుంటే.. ఉసిరి థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది. మనం నేరుగా ఉసిరిని ఎక్కువగా తినలేం కాబట్టి, దీనిని ఉడకబెట్టి, పచ్చడి చేసుకుని తినవచ్చు. తేనెతో కూడా తినవచ్చు. ఖాళీ కడుపుతో ఉసిరిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.
బ్రెజిలియన్ బీటెల్ నట్: సెలీనియం.. థైరాయిడ్ గ్రంధి పనితీరుకు అవసరమైన సూక్ష్మపోషకం. T4ని T3గా మార్చడానికి సెలీనియం అవసరం. బ్రెజిలియన్ బీటెల్ నట్‌లో సెలీనియం లభిస్తుంది. రోజుకు మూడూ బ్రెజిలియన్ బీటెల్ నట్ తీసుకుంటే థైరాయిడ్ గ్రంధి పనితీరు మెరుగుపడుతుంది. బ్రెజిలియన్ బీటెల్ నట్‌లో మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది.
గుమ్మడి గింజలు: గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, జింక్ పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా జింక్.. శరీరం ఇతర విటమిన్లు, మినరల్లు గ్రహించడంలో సహాయపడుతుంది. జింక్ శరీరంలో థైరాయిడ్ హార్మోను ఉత్పత్తి , నియంత్రణకు సహాయపడుతుంది.
వీటికి దూరంగా ఉండాలి
- మిల్లెట్స్, సోయా గింజలు, టోఫు వంటి సోయా పనీర్, ఇతర సోయా ఉత్పత్తులను, చిలగడ దుంపలను మానేయాలి.
- వేరుశనగ గింజలు, క్యాబేజ్, బ్రోకలీ, క్యాలీఫ్లవర్, పాలకూర వంటివి బాగా తగ్గించాలి.
- అయోడిన్ లోపం లేని వాళ్లు కొన్ని రకాల మిల్లెట్స్‌ను తీసుకోవచ్చు. ఇది డాక్టర్ సలహా మేరకు పాటించాల్సిన జాగ్రత్త. ఇది దేహతత్వాన్ని బట్టి వ్యక్తికీ వ్యక్తికీ మారుతుంది.
- బేకరీ ఉత్పత్తులను పూర్తిగా మానేయాలి.